Pages

Search This Blog


Wednesday, July 14, 2010

''సిరివెన్నెల'' సీతారామశాస్త్రి






తెలుగు సినీ గీతానికి అసుర సంధ్య అనదగ్గ సమయంలో ఉదయించి సిరివెన్నెల కురిపించిన చందమామ ఆయన.పైకి అందరికీ తేలికగా అర్ధమౌతూనే ఎంతో నిగూఢమైన భావ గాంభీర్యాన్ని కలిగిన కలం ఆయనది. ఆయన పదాల ఎంపిక, వాటి అమరిక లోనే ఆయన గొప్పతనం తెలిసిపోతుంది.

ఆయన వాడే ప్రతి అక్షరం అప్పుడే పుట్టిన పాపాయిలా ఎంతో ముద్దుగా ఉంటుంది
అక్షరం ఆయన కోసమే పుట్టిందా అన్న భావన మనకి కలుగుతుంది.

వాన బొట్టు ఆల్చిప్పాలో పడితేనే ముత్యం అవుతుంది
అదే చినుకు సముద్రంలో పడితే అలలలో కొట్టుకుపోతుంది
అలా శాస్త్రి గారిని ఒడిసిపట్టిన ఆల్చిప్ప విశ్వనాధ్ గారు.
కళకి జీవం తోడైంది అదే జీవకళై సిరివెన్నెలగా మిగిపోయింది.

ఆయనే సిరివెన్నెల సినిమాతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా మారిన చేంబోలు సీతారామ శాస్త్రి. తెలుగు సినీ గీతరచయిత.

విధాత తలఁపున ప్రభవించినది... అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు స్థానం సంపాదించి పెట్టంది. భావగర్భితమైన ఈ పాట రాయడానికి తనకు వారంరోజులు పట్టినట్లు సిరివెన్నెల ఒక ఇంటర్‌వ్యూ లో చెప్పాడు. ధన మాయ ను ఎంత చిన్న చిన్న పదాలలొ పొదగగలరో దైవ మాయ ని కూడ అంతే సులువుగా విడమరచి చెప్పగల ప్రజ్ఞాశలి సిరివెన్నెల. సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎప్పుడో ఎర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రష్ఠులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగు లో ప్రజనీకానీకి తెలిసిన/తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల. ఫ్రస్తుత కాలమాన పరిస్ఠితులలో ప్రముఖం గా సినిమా పాటలతో ప్రజలను అలరిస్తున్న 'సిరివెన్నెల పాటల వల్ల మాత్రమే తెలుగు పాటల్లో లో తెలుగు ఇంకా బ్రతికి ఉంది అంటే అతిశయోక్తి కాదు అంటే ఒప్పుకోని జనాభా తక్కువేమో.

"అడవిగాచిన వెన్నెల" అన్న సామెతని చమత్కారంగా "వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా"అంటూ మార్చిన చమత్కారం..ఆయన సొంతం."పడమర పడగలపై వెలిగే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరీ తూరుపు వేదికపై వేకువ నర్తకివై రాత్రిని వెలిగించే కాంతులు చిందనీ"అనే భావ గాంభీర్యం ఆయన వరం.

కె.విశ్వనాథ్ వల్ల వెలుగులో కి వచ్చిన చేంబోలు సీతారామ శాస్త్రి "సిరివెన్నెల" సినిమాలో అన్ని పాటలు ఘన విజయాలు సాధించడం వల్ల తేలికగా సినీ రంగం లొ స్థిరపడ్డారు అనుకుంటాము సాధారణం గా.కానీ సిరివెన్నెల తరువాత వచ్చిన అవకాశాలను ఆయన ఉపయోగించుకో లేకపోయారు.అప్పట్లో ఆయన ఇలాంటి పాటలే హిట్టవుతాయనుకునే దర్శకుల వల్లా,అక్కడకక్కడే రాయమనే నిర్మాతల వల్లా చాలా ఇబ్బంది పడ్డారు.మెల్లిగా ఈయన సిరివెన్నెల లాంటి వాటికి తప్ప కమర్షియల్ సినిమాలకు పనికి రాడనే పేరు వచ్చేసింది .సరిగా అప్పుడే దర్శకుడు వంశీ సిరివెన్నెలలో కమర్షియల్ గా రాస్తూ కవితాత్మను వదలని లక్షణాన్ని గమనించారు. దాంతో ఆయనకు కమర్షియల్ బాణీ అలవాటుచేశారు వంశీ. అలా వచ్చిందే లేడీస్ టైలర్. ఇక వేటూరిలా అలవోకగా రాయలేని ఇబ్బందిని ఓ చిట్కా కనిపెట్టి పరిష్కరించుకున్నరు.అదే ఈవెనింగ్ సిట్టింగ్స్.సాయంత్రం సందర్భం చెప్పించుకుంటే రాత్రంతా టైం వస్తుందని కనిపెట్టారాయన. అలా సీతారామ శాస్త్రి హిట్టయ్యారు.

ఆయన కెరీర్‌ తొలిపాటలో రాసినట్లు 'విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితి ఈ గీతం' అంటూ రాజీలేని ధోరణిలో అద్భుతంగా కొనసాగుతోంది. 'గంగావతరణం' అనే గేయనాటిక విన్న విశ్వనాథ్‌ 'సిరివెన్నెల' చిత్రంకి పరిచయం చేస్తే ఆ గేయ నాటిక విన్న బాలు సీతారామశాస్త్రి సినిమాపాటని పాడకుండానే ''మీవి వందల పాటలు పాడాలని వుంది'' అని సీతారామశాస్త్రితో అనడం ఆ మాట ఫలించడం అంటే వందలాది పాటలు బాలు గళం నుంచి వెలువడడం జరిగింది.

సినిమా రచయితగా మారాడానికి ముందే సినారె రచనలను బాగా అభిమానించి ఆరాధనా భావం ఏర్పరుచుకున్న సీతారామశాస్త్రి సినారెని 'వృత్తి రాతగాడు కాదు వుత్తి రాతగాడూ కాదు' అని ప్రశంసించారు. అలాగే వేటూరిని కూడా అభిమానించడమే కాదు గురువుగా భావిస్తారాయన అందుకే 'విశ్వనాథ్‌ వేటూరి నాకు ప్రాత:స్మరణీయులు' అంటుంటారు.

''సినిమాని చీప్‌ ఆర్ట్‌ గా చాలమంది భావిస్తారు. అలాగే సినిమా కవుల్నీ. సినిమాకవి మామూలు కవి కంటె గొప్పవాడు. పాత్రలోకి ప్రవేశించి పాత్రతో అనిపించగలడు. అయినా సినిమాకి కావ్య గౌరవం సినీ పాటకి సాహిత్య గౌరవం రావడం లేదు'' అనే ఆవేదన సీతారామశాస్త్రి వెలిబుచ్చుతుంటారు అప్పుడప్పుడు.

''పాట, పాటలో మాట ఆర్కెస్ట్రాలో భాగమైపోయింది ఇటీవల. అందుకే పాటతో బాటు ఆ పాటలోని మాట వినబడితే ఏమౌతుందో, ఏ కొంప ములుగుతుందో అనే బాధవుంది. సమాజం ఎక్కడ నుంచోరాదు. నానుండి, నా ఇంటినుంచి మొదలవుతుంది అని ప్రతి ఒక్కరూ అనుకుంటే మంచి సమాజం మంచి రచనలు, మంచి సినిమాలు వస్తాయి'' అని అంటారు. సీతారామశాస్త్రి సామాజిక బాధ్యత నుంచి తప్పించుకుని వెళ్ళకుండా ఆది నుంచి ఆ బాధ్యతనే పాటలు రాస్తుంటారు అనేది చాలమంది అభిప్రాయం.

అందుకే ఆయన రాసిన తొలి పాట 'విధాత తలపున ప్రభవించినది'తో ప్రారంభమైన నంది అవార్డ్‌ 'గమ్యం' చిత్రం వరకు అంటే 2008 వరకు పదిసార్లు లభించింది. గొప్ప గాయని గాయకులు అద్భుతంగా పాడినపుడు వింటూ ఎలా ఆనందం పొందుతామో చదివినపుడు కూడా అదే ఆనందం పొందగలిగితే అదే గొప్ప పాటగా నిలిచిపోతుందని నమ్ముతారు. అందుకే గొప్ప పాటలు, అద్భుతమైన పాటలు వెలువడుతాయి ఆయన కలం, గళం నుంచి.

"మంగళసూత్రం అంగడిసరుకా కొనగలవా చేజారా"కా అని ఒక్క మాటలో సూత్రం గొప్పతనం చెప్పినా
"ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు" అని జీవిత పరమార్ధం వడపోసినా
"ఎప్పుడు ఒప్పుకో వద్దురా ఓటమి ఎప్పుడు వదులుకో వద్దురా ఓరిమి" అని గెలుపు తలుపుకు దారి చూపినా
"పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం" అని విడాకుల చట్టానికి ఎదురేగి తప్పుని ఎత్తి చూపినా
అది శాస్త్రి గారికి మాత్రమే చెల్లింది .

సాహితీ లోకాన "సిరి" చందనమై సౌరభించిన సగంధుడు
వేల హృదయాల్లో "వెన్నెల"వెలుగై వసించి ఉన్న వరేణ్యుడు
"సిరివెన్నెల"గా కురిసి,మదిమాపులలో మెరిసి
మనసులు గెలిచిన మేధావి
పాటల తోటన విరితావి !
"జగమంతా తన కుటుంబమన్న" తాత్వికుడు
"ఆకాశంలో ఆశల హరివిల్లులు" చూసిన స్వాప్నికుడు
"సిగ్గులేని జనాన్ని నిగ్గదీసి నిజమడిగిన" ధీమంతుడు
"బోసినోటి తాత కీర్తి భగవద్గీత" గా వినిపించిన బోధకుడు
"పూలబాలల కేల మూణ్ణాళ్ళ ఆయువని" ఆక్రోశించిన ప్రకృతి ప్రేమికుడు
"చంద్రుళ్ళో ఉండే కుందేటిని" నేలకి దింపిన నిజమైన భావుకుడు
"అడగాలనుంది ఒక డౌటుని" అని పసిపాపలా మారాం చేసినా
"సముద్రాన్ని కన్నె పిల్ల కన్నుల్లో కన్నీటి అలలు"గా మార్చినా
"నేననీ నీవనీ వేరుగా లేమని" యువ హృదయాల్ని ఊయలలూపినా
"చెప్పుకోనీవు తప్పుకోనీవు" అని ప్రేమని సున్నితంగా మందలించినా
"జాలిగా జాబిలమ్మ" కి జోలపాడి నిద్రపుచ్చినా
"విరించిలా విపంచిలా" అక్షరాలతో వేణువులూదినా
తనకి ఎవరు రాగలరు సాటి
వింతగా మానసవీణ ను మీటి!
రవళించే రాగాలకు కమనీయపు రూపమిచ్చి
సంగీతపు సంద్రానికి ఉప్పెనలా పొంగునిచ్చి
చిన్ని పూరేకు లాంటి పాటకు చిరు చినుకులా ప్రాణమిచ్చి
అలసిపోని అల మాదిరి
కరిగిపోని కల మాదిరి
ఆగిపోదు ఆ కలం
మూగ బోదు ఆ గళం!!!!!!!!!!

వెన్నెల వెలుగును తనలోనే దాచుకోక అందరికీ పంచిస్తూ
కలకి ఇలకి బేధం చూపి జీవన సత్యం బోధిస్తూ......
అర్ధశతాప్దపు అజ్ఞానాన్నే తరిమేసే ఒక రక్తపు సిందూరమై....
వెలిగిపోతున్న మీకు ఇవే మా సహస్రకోటి వందనాలు....

No comments:

Post a Comment