Pages

Search This Blog


Thursday, August 4, 2011

డాక్టర్ సి.నారాయణరెడ్డి

సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి, తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.

ఆయన ప్రముఖంగా కవి అయినప్పటికీ అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవాడు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రిక లో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి.

రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. 1962 లో గులేబకావళి కథ చిత్రం లోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అనే పాటతో ప్రారంభించి నేటి వరకు 3500 గీతాలు రచించాడు.

దాదాపుగా తెలుగు సినీరంగంలోని అందరి అగ్ర హీరోలతోపాటు, ఎందరో వర్ధమాన హీరోలకు పాటలు రాసిన ఖ్యాతిని దక్కించుకున్నారు. అంతేగాకుండా ఉర్దూ సాహితీ ప్రక్రియ ఆయన గజల్స్‌ కూడా తెలుగులో రాసి గజల్‌ కవిగా కూడా పేరుగాంచారు.

సినారె గ్రంథాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మళయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లో కవితలల్లారు. అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ , డెన్మార్క్,థాయ్ ల్యాండ్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990 లో యుగోస్లేవియాలోని స్రూగా లో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనం లో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నాడు.

1969లో తెలంగాణా అంతటా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లోనే సమైక్యతకు ఊపునిచ్చే ... '' తెలుగు జాతి మనదీ - నిండుగ వెలుగు జాతి మనదీ...'' అనే గీతం రాసి తెలంగాణా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నరు డాక్టర్‌ 'సినారె'.

తొలి తెలుగు జ్ఞానపీఠ బహుమతి గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఏకవీర నవల ఆధారంగా వచ్చిన ఏకవీర. సినిమాకు మాటలు రాసింది మరో జ్ఞానపీఠ గ్రహీత సి.నారాయణరెడ్డి. నారాయణరెడ్డి తన సినీరచనా జీవితంలో సంభాషణలు రాసిన సినిమాలలో ఇది మొదటిది కాగా రెండవది అక్బర్ సలీం అనార్కలి.

No comments:

Post a Comment