Pages

Search This Blog


Sunday, May 20, 2012

దర్శకుడు 'అశోక్'



హ్యాపీడేస్
చిరంజీవి ఫాన్స్ అంతా నా ఫాన్సే!

'రేపటి పౌరులు' చిత్రంలో బాలనటుడిగా తెరంగేట్రం చేసిిన అశోక్ కాస్త పెద్దయ్యాక ఇంజనీరింగ్ పట్టాతో పాటు 'కొరియోగ్రాఫర్' అవతారమెత్తారు. వరసపెట్టి 60 డాక్యుమెంటరీలు తీయడమే కాక 'ఉషోదయం' అనే పిల్లల చిత్రానికి గాను 2007లో ఉత్తమ దర్శకుడిగా జ్యూరీ నంది పురస్కారం కూడా అందుకున్నారు. 'ఫ్లాష్ న్యూస్', 'ఆకాశరామన్న' చిత్రాల తర్వాత 'పిల్ల జమిందార్'తో అందరి దృష్టిలో పడ్డారు. త్వరలో 'సుకుమారుడు'గా దర్శనమివ్వబోతున్న ఆ నవ దర్శకుడు చెబుతున్న హ్యాపీడేస్ ఇవి.

కాలేజీలో ప్రవేశించే నాటికే నేనొక బుల్లి సెలబ్రిటీని. అప్పటికే కొన్ని వందల డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వడంతో పాటు రేపటి పౌరులు, నవభారతం, గడుగ్గాయ్ లాంటి కొన్ని సినిమాల్లో బాలనటుడిగా నటించేశా. అదీగాక ఒంగోల్లో జరిగే ప్రతి ఫంక్షన్‌లో నా డాన్స్ విధిగా ఉండాల్సిందే. చిరంజీవిగారి డాన్స్‌లు చేసి చేసి 'జూనియర్ చిరంజీవి'గా మనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది. ఈ డాన్స్‌ల్లో మునిగి ఎక్కడ ఫెయిలైపోతానో అని అమ్మ భయం. కళలు కూడు పెట్టవని కొందరు శ్రేయోభిలాషులు చెవిలో ఇల్లుగట్టుకుని పోరేసరికి మెల్లగా మునిసిపల్ హైస్కూల్ నుండి నా 'సీటు' కదిపి పదో తరగతికి 'నాగార్జున రెసిడెన్షియల్'లో వేశారు. ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదవాల్సి వచ్చింది.

చెల్లి ఫోర్జరీతో గుంజీళ్లు తప్పేవి
రెసిడెన్షియలైనా ఇంటినుండే కాలేజీకి వెళ్తుండేవాణ్ణి. మన అడ్డా ఎక్కువగా శ్రీనివాస్+ శ్రీదేవి జంట థియేటర్ల దగ్గరో, రత్నమహల్ వద్దో ఉండేది. చిన్నప్పుడు మా చెల్లి అరుణతో పాటు కూచిపూడి, భరతనాట్యం, కథక్ నేర్చుకోవడం వల్ల డాన్స్ నా ఆరోప్రాణం అయింది. ముఖ్యంగా చిరంజీవిగారి స్టెప్స్ అంటే పడి చచ్చేవాణ్ణి. సినిమా పిచ్చితో రాత్రుళ్లు సెకండ్ షోలు చూసి ఆలస్యంగా నిద్రలేవడం, లేటయినప్పుడల్లా తెలివిగా కాలేజీకి టి.వి.ఎస్ బండి వేసుకెళ్లి దారిలో బండి రిపేరొచ్చిందని అబద్దాలు చెప్పడం ... రోజూ రిపేర్లేమిట్రా అని మా లెక్చరర్స్ విస్తుపోవడం ... ఇలా నడుస్తుండేది. ఒక్కోసారి పూర్తిగా డుమ్మా కొట్టేసేవాణ్ణి.

అందుకుగాను నాన్నతో లెటర్ రాయించి తీసుకు వెళ్లాల్సి వచ్చేది. ఫోర్జరీ చేయడంలో మా చెల్లిది అందెవేసిన చెయ్యి. 'ఇస్నోఫీలియా వల్ల మా అబ్బాయి నిన్న రాలేకపోయా'డని నాన్న సంతకంతో లెటర్ తయారుచేసి నన్ను ఒడ్డున పడేసేది. లేదంటే అమ్మాయిల ముందే గుంజీళ్లు తీయాల్సి వచ్చేది. ఇంట్లో ఈ వేషాలన్నీ కనిపెట్టారో ఏమో-ఇంటర్ సెకండియర్‌కి అద్దంకి వెళ్లేదారిలో గుళ్లాపల్లి దగ్గర ఉండే 'నాగభైరవ రెసిడెన్షియల్' కాలేజిలో చేర్పించారు. మనం ఆడిందే ఆటగా పాడిందే పాట గా సాగిన జీవితం ఒక్కసారి దారితప్పినట్టు అనిపించింది. మనసుంటే మార్గం ఉంటుందనే తత్వం బాగా వంటబట్టినవాణ్ణి కాబట్టి మెల్లగా దారులు వెతకడంలో నిమగ్నమయ్యా.

వీరబాబుగార్కి దొరికిపోయాం
ముందుగా మస్తాన్ అనేవాణ్ణి మిత్రుడిగా చేసుకున్నా. ఎంచేతంటే వాడు అప్పటికే మూడేళ్లుగా అక్కడే చదువుతున్నాడు. కాలేజీ లూప్‌హోల్సన్నీ బాగా తెలిసినవాడు. ఏ వేళప్పుడు, ఏ దారిగుండా బయటకి పారిపోవొచ్చో చెప్పేవాడు. మా కాలేజీ నుండి ఒంగోలు అరగంట ప్రయాణమే కాబట్టి తప్పించుకుని మెయిన్‌రోడ్ ఎక్కేసి ఏ లారీనో పట్టుకుని సినిమాకు చెక్కేసేవాళ్లం. ఒకరోజు 'కొదమసింహం' సినిమా చూసి మెల్లగా గోడ దూకబోతుండగా ఎదురుగా మా కరస్పాండెంట్ వీరబాబుగారు వీర లెవల్లో నిల్చుని చూస్తున్నారు. మా పై ప్రాణాలు పైనే ఉష్ ... శిక్ష తప్పలేదనుకోండి. కొన్నాళ్లు బుద్ధిమంతుడిలా ఉన్నా. కానీ చిరంజీవిగారి సినిమా నన్ను నిలవనిచ్చేది కాదు. అలవాటు పడ్డ ప్రాణం కదా! వాచ్‌మేన్‌కు ఐదో, పదో సమర్పించి చెక్కేస్తుండేవాళ్లం.

మూడు నెలలు తప్పించుకు తిరిగా
డాన్స్ బ్రహ్మాండంగా చేస్తానని తెలిసి కొందరు అమ్మాయిలకి డాన్స్ నేర్పించమని ఆర్డర్ వేసి మగపురుగైనా వెళ్లలేని లేడీస్ హాస్టల్లోకి నన్ను పంపేవారు. ఆ క్రమంలో తక్కువ కాలంలోనే అందరి నోళ్లలో నాలుకైపోయా. ఆ ఏడాది డిసెంబర్ 31కి నేను కంపోజ్ చేసిన ఐటమ్ సాంగ్స్ పెట్టించారు. ఆ మర్రోజే నాన్న బర్త్‌డే కాబట్టి ఎంత రాత్రయినా ఇంటికి వెళ్లాలనే తొందర్లో అటూ ఇటూ తిరుగుతున్నాను. ప్రోగ్రాం అయినవెంటనే ఒకమ్మాయి వచ్చి నా చేతికి గులాబి పువ్వుతోపాటు 'గ్రీటింగ్' ఇచ్చింది. బహుశా నన్ను అభినందిస్తున్నదేమోనని విప్పి చూసి తెల్లబోయా. అదొక ప్రేమలేఖ. చెమటలు పట్టేశాయి. గబగబ జేబులో కుక్కేసి, కంగారుగా టాయిలెట్ రూమ్‌కు పరిగెత్తి సాంతం చదివా. ఈ విషయం లీకైతే తాట వలిచేస్తారని 3 నెలల వరకు ఆ అమ్మాయిని తప్పించుకుని తిరిగానంటే నమ్మండి.

చిలిపి చేష్టలు తారాస్థాయిలో ఉండేవి
బాత్రూమ్‌లు తక్కువ ఉండడంతో ఆరుబయట పెద్ద తొట్టి పెట్టి దాన్నిండా నీళ్లు పోసి ఉంచేవారు. అక్కడ చచ్చినా స్నానం చేసేవాణ్ణి కాదు. 'తొట్టి'గ్యాంగ్ మాత్రం అక్కడే జలకాలాడేది. స్టడీ అవర్ రాత్రి 8 గంటలకి మొదలయ్యేది. ఆలోపు స్నానం చేసి పరిగెత్తాలి. బాత్రూంలో ముందుగా స్నానం చేయడం ఎలా అనే ఐడియా వేసి సబ్బులన్నీ కలిపేసేవాణ్ణి. ఎవరి సబ్బు వాళ్లు ఏరుకునే లోగా నా స్నానం అయిపోయేది. కొంటె పనులకు కొదవుండేది కాదు. కుమార్ అనేవాడు స్నానం చేస్తుంటే వాడి టవల్‌ని దాచేసేవాళ్లం. దాంతో వాడు బాగా చీకటి పడ్డాక ఆదిమానవుడి అవతారంలో బాత్రూం నుండి దొంగలా బయటకి వచ్చేవాడు. స్టడీ అవర్‌కి వాడెందుకు లేట్‌గా వస్తున్నాడో మాకు తప్పించి మరెవరికీ తెలియని మిస్టరీ అది.

ఒక్కోసారి కాంటీన్‌కి ముందుగా వచ్చేసి ఏం తోచక టేబుల్ మీద ఉండే సాంబారు మగ్గులో పక్కనే ఉండే ఉప్పును సాంతం ఒంపేసి ఆ మగ్గుని ఒకరికి తెలియకుండా ఒకరం టేబుల్స్ మార్చేసి... ఆ సాంబారు ముందుగా పోసుకున్న వాడి ముఖకవళికల్ని గమనించేవాళ్లం. కొన్నాళ్లకి మాలోనే ఎవరో ఉప్పు కలుపుతున్నారని పసిగట్టి స్పూను సాంబారుని తీర్థంలా చేతిలో పోసుకుని రుచి చూసి ఆ తర్వాతే అన్నంలో కలుపుకునేవారు.

ర్యాగింగ్ ర్యాగింగ్ ర్యాగింగ్
ఇంటర్మీడియట్ తర్వాత విజయవాడ దగ్గర్లోని 'కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీ'లో చేరాను. కొత్తలో ర్యాగింగ్ చేస్తారని తెలిసి చాలా భయపడిపోయాను. ఒకరోజు అనుకోకుండా 9మంది సీనియర్స్ బిలబిలమంటూ క్లాసులోకి వచ్చేసి 'చిరంజీవి ఫ్యాన్స్ ఎంతమందో చేతులెత్తండి' అన్నారు. 20 మంది ఎత్తారు. వెంటనే చిరంజీవికి సంబంధించి కొన్ని ప్రశ్నలు వేశారు. వాళ్లు చెప్పలేకపోయేసరికి ఎండలోకి తరిమేశారు. తర్వాత బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరన్నారు - మరికొందరు చేతులెత్తారు. బాలకృష్ణ వాళ్ల అబ్బాయి పేరేంటని అడిగారు. ఎవరూ చెప్పలేకపోయేసరికి నేను చెప్పాను.

అంతే! నీవే నిజమైన బాలకృష్ణ అభిమానివని మెచ్చుకుని వచ్చే సండే 'నిప్పురవ్వ' సినిమాకి మాకందరికీ టికెట్లు తీసుకొచ్చి ఇవ్వమని ఆర్డర్ వేసి వెళ్లారు. మరోసారి మాలో కొందర్ని హాస్టల్స్‌కు తీసుకెళ్లారు. ఒక దగ్గర టూత్‌పిక్ మొదలుకుని మూడడుగుల పొడవుండే కర్రలున్నాయి. ఎవరికి ఇష్టమైన కర్రని వాళ్లని సెలక్ట్ చేసుకోమన్నారు. సెలక్ట్ చేసుకున్నవాటితో కొడతారేమోనని భయపడి మాలో ఒకడు టూత్‌పిక్ సెలక్ట్ చేసుకున్నాడు దెబ్బ తగలదు కదా అని. దాంతో హాస్టల్ కాంపౌండు చుట్టుకొలతని కొలుచుకుని రమ్మన్నారు. ఒకన్ని కర్ర పట్టుకుని తాతలా నడవమన్నారు.

చికుబుకు చికుబుకు రైలే ...
ఒకరోజు సుధాకర్ అనే మిత్రుడు కరకట్ట రోడ్డు పక్కన లూనా పైనుండి పడేయడంతో కాలికి దెబ్బతగిలి ఇంట్లోనే ఉండిపోయా. సిద్ధార్థ కాలేజీకీ మాకూ సై అంటే సై అన్నట్టు ఉండేది. ఇల్లు వెతుక్కుంటూ మా సీనియర్ 'బాబు' వచ్చి నన్ను అర్జెంటుగా తయారవమన్నాడు. కాలు నెప్పిగా ఉన్నా తప్పలేదు. బైక్‌మీద సరాసరి స్టెల్లా కాలేజీకి తీసుకెళ్లి 'నీవు ఇప్పుడు డాన్స్ చేయాలి. మన కాలేజీ తరపున కాంపిటేషన్‌లో పాల్గొనాలి' అన్నాడు. బదులు చెప్పలేక, కాలు నెప్పితోనే 'చికుబుకు చికుబుకు రైలే' పాటకి డాన్స్ చేశా. డాన్స్‌మూడ్‌లో చూసుకోలేదు ... రక్తం కారిపోతోంది. తనే కట్టుకట్టించి ఇంట్లో దింపేసి వెళ్లాడు. మూడు రోజుల తర్వాత కాలేజీకి వెళ్లా. అప్పటికే ఫ్రెండ్స్ అంతా స్వీట్స్ పంచేసుకున్నారు డాన్స్ కాంపిటేషన్‌లో కాలేజీకి ఫస్ట్ ఫ్రైజ్ వచ్చిందన్న ఆనందంలో. చూడండి ఎంత అన్యాయమో.

ప్రేమలూ - చీవాట్లూ
నా సీనియర్ ఒకమ్మాయి నాతో పాటు ప్రోగ్రామ్స్‌లో డాన్స్ చేస్తుండేది. ఒకరోజు లోన్లీగా ఉన్నప్పుడు దగ్గరకొచ్చి "నీవు లేకుండా జీవించలేను. ఒక్క అరగంటలో రిప్లయ్ ఇవ్వాలి ... అదీ పాజిటివ్‌గా'' అని బాంబు పేల్చి, చేతిలో చీటీ పెట్టేసి వెళ్లిపోయింది. ఇదెక్కడి గొడవరా బాబూ అని కంగుతిన్నాను. అదే రోజు చివరి పీరియడ్ ప్రిన్స్‌పాల్‌ది కావడంతో అతడు క్లాసుకు వస్తాడో, రాడో కనుక్కుందామని ఆ అమ్మాయి క్లాస్‌రూమ్ ముందునుండే వెళ్లాను. నేను ప్రిన్సిపాల్ గదికి వెళ్లడం ఆ అమ్మాయి చూసింది. 'ప్రేమలేఖ' విషయం చెప్పేసి ఉంటానని డిసైడ్ చేసుకుని అదే రోజు సాయంత్రం బైక్ స్టాండ్ దగ్గర పట్టుకుని నిలదీసింది. 'ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి గానీ, ప్రిన్సిపాల్‌కి కంప్లెయింట్ చేస్తావా' అని విరుచుకుపడింది. నేను ఏం చెప్పినా తను వినే స్థితిలో లేదు. పరోక్షంగా ప్రిన్సిపాల్ నన్ను రక్షించాడన్నమాట.

పోలీస్ స్టేషన్లో ఒక రాత్రి
ఒకసారి సంక్రాంతి సెలవుల్లో ఒంగోలు వెళ్లాను. ఊర్లో గాయత్రి యాగం జరుగుతోందని తెలిసి వాలంటీర్‌గా హెల్ప్ చేద్దామని అనంతభట్ల శ్రీనివాస్ అనే మిత్రుడితో కలిసి వెళ్లాను. యాగం అయ్యేసరికి రాత్రి పదకొండు దాటింది. ఇంటికి నడుచుకుంటూ బయల్దేరాం. మా వెనక తొట్టిగ్యాంగ్ వస్తోంది. కొంత కాలంగా అమ్మాయిల టీజింగ్ జరుగుతోందని నిఘా వేసి ఉంచారట పోలీసులు. మా మాటల్లోనే పెట్రోలింగ్ వ్యాన్ రావడం, మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని వ్యాన్ ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లడం క్షణాల్లో జరిగిపోయాయి. మా వెనకాల వస్తున్న గ్యాంగు పోలీసుల్ని చూడగానే చెల్లాచెదురైపోయింది కాబట్టి వాళ్లెవరూ దొరకలేదు. పోలీసులు యక్షప్రశ్నలు వేస్తుంటే అక్కడే ఉన్న ఒక లేడీ కానిస్టేబుల్ "అమ్మాయిలు వాళ్ల వెంట పడేలా ఉన్నారు కానీ, వీళ్లు అమ్మాయిల వెంట పడేలా ఉన్నారా?'' అని మమ్మల్ని తెచ్చిన పోలీసులకు చీవాట్లు పెట్టి మమ్మల్ని పంపించేసింది.

ఫైనల్ సెమిస్టర్ రాయకముందే సినిమాల్లో 'కంపోజర్ అసిస్టెంట్'గా ఛాన్స్ రావడంతో మద్రాసు వెళ్లిపోవడం, తర్వాత దాదాపు 200 పై చిలుకు సినిమా నృత్యాలకు కొరియోగ్రాఫర్‌గా చేయడం, లండన్ 'లెబియన్' యూనివర్సిటీకి వెళ్లి లాటిన్ స్టయిల్లో 'సల్సా లంబా' అనే డాన్స్ నేర్చుకుని రావడం ... తర్వాత దర్శకత్వ శాఖలో చేరిపోవడం ఒకటి తర్వాత ఒకటి జరిగిపోయాయి కానీ, అందమైన నా కాలేజీ డేస్ మాత్రం మదిలో నిశ్చలంగా మిగిలిపోయాయి.

No comments:

Post a Comment